పునీత జెరోమ్ స్మరణ
ఫాదర్ జెరోమ్ (ఏకశిల విచారణ ,వరంగల్)
29 Sep 2024
పునీత జెరోమ్ గారు క్రీ.శ 341లో యుగోస్లేవియాలో 'దల్మాతియా' ప్రాంతాన అక్విలియా పీఠంలోని "స్టిడోనియస్" అనే చిన్న పట్టణంలో జన్మించారు.వీరి పూర్తి పేరు యుసేబియస్ హిరోనిముస్ సొప్రోనియుస్ జెరోమ్ గారు ఒక సింహం బొమ్మ గుర్తుతో కలసి ప్రదర్శింపబడుతుంటారు. ఎందుకంటే వీరు ధైర్య సాహసాలు గల విశ్వాస యోధుడు అందుకని వీరిని "దల్మాతియా" సింహం అని బిరుదు ఉంది.
వీరి తండ్రి ధనవంతుడు.ఉత్తమ క్రైస్తవుడు,జెరోమ్ గారిని వారి తండ్రి చిన్నప్పటి నుండి మంచి క్రమశిక్షణతో పెంచారు. వీరి 12వ ఏట ప్రామాణిక విద్య నేర్పటం కొరకు రోమ్ నగరానికి పంపించారు.
జెరోమ్ గారు మంచి వ్యాకరణ దిట్ట అయిన డొనాటస్ మరియు మంచి వక్త అయిన విక్టోరినస్ వంటి అధ్యాపకుల వద్ద చదువుకున్నారు.జెరోమ్ గారు 19వ ఏట అనగా క్రీ.శ 360లో తిబేరియన్ పాపు గారి ద్వారా జ్ఞాన లస్నానం పొందారు.జెరోమ్ గారు గ్రీకు లాటిన్ భాషల్లో పండితులయ్యారు.జెరోమ్ గారు తన యవ్వనంలో విందులు, వినోదాల కోసం సమయం వ్యర్థం చేశారు. కొన్ని రోజుల తర్వాత జర్మనీలోని "త్రిదెస్" పట్టణానికి వెళ్లారు.స్లాటుస్,తెరింతియస్,విర్జిల్,సిసిరో వంటి ప్రసిద్ధ గ్రంథకర్తల రచనలు పఠించారు.
పునీత జెరోమ్ గారు గురువు, శ్రీ సభ పండితులు. వీరు పాశ్చాత్య శ్రీసభ కోవిదులైన పునీతులు అంబ్రోసు,అగస్టిను,పెద్ద గ్రెగొరి వాళ్లతో సరితూగగల విధ్వాంసులు సకల విజ్ఞానవరసంపద ఘని.బైబిల్ శాస్త్ర పండితులుగా చెప్పుకోదగ్గ వ్యక్తి. గొప్ప గ్రాంధిక భాషాభిమాని
పునీతుల్లో కూడా తప్పులున్నట్లే జెరోమ్ గారు కూడా ముక్కోపి వీరు యదార్ధాన్ని కుండలు బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవారు. సత్యము, ప్రేమ అనే అంశాల గురించి మాట్లాడేవారు. తన రచనలతో సమాధానం చెప్పేవారు.
జెరోమ్ గారికి మిత్రులతో పాటు శత్రువులు విమర్శకులు కూడా ఉన్నారు. తన దుర్గుణాలను త్యజించడానికి పశ్చాతాప క్రియలను ఆచరించిన వ్యక్తిగా శ్రీసభలో వీరికి పేరుంది.తన 80 సం"ల జీవితంలో 40 సంవత్సరాలు ఏకాంత వాసంలో ప్రార్థన, పఠనము ఎలాంటి సుఖం లేకుండా కఠోర నిష్ట, తపోదీక్షను పాటించారు. తన తప్పులను మన్నించమని సిలువపై వ్రేలాడే క్రీస్తుని ప్రార్థించేవారు.జెరోమ్ గారి 35వ ఏట బాగా జ్వరం వచ్చి చనిపోతారేమో అనుకునే సమయంలో ఒక కల వచ్చింది ఆ కలలో "జెరోమ్ గారు పరలోకానికి తీసుకొని పోబడినారు". ప్రభువు ముందు నిలబడి ఉన్నారు. ఆ ప్రభువు వెలుగును చూడలేక ఆయన కళ్ళు జిగేలు మంటున్నాయి. తలపైకి ఎత్తలేకపోయారట
"నీవు ఎవరివి అని క్రీస్తు ప్రశ్నించారు. జెరోమ్ గారు క్రైస్తవుడని జవాబిచ్చారు. నీవు అబద్ధం చెప్తున్నావని ప్రభువు అన్నారు.జెరోమ్ గారు మాత్రం నేను క్రైస్తవుడననే బిగ్గరగా అన్నారట. క్రీస్తుప్రభువు జెరోమ్ గారితో నీవు వింతలు చెప్పే పండితుడిలా ఉన్నావు కానీ క్రైస్తవుడిలా లేవు అని హెచ్చరించారు.దానితో కలత చెందిన జెరోమ్ గారు తన 38వ ఏట అంతియోకుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని చాల్సిస్ లోని ఫీర్స్ అనే సిర్దియా ఎడారి కి వెళ్లి అక్కడ యాదా సన్యాసి దగ్గర ఘోర తపస్సు చేశారు.తన తప్పుల కోసం పాపల కోసం రోదించి, కఠిన ఉపవాసాలతో రాళ్లతో శరీరాన్ని కొట్టుకొని మండుటెండలో సోమసిల్లారు. ఆ విధంగా సైతానుకి దూరంగా పవిత్రాత్మను శాశ్వతంగా పొందారు.అక్కడే యూదా సన్యాసి దగ్గర హిబ్రూ భాషను అధ్యయనం చేశారు.
క్రీ. శ! 380లో తన 39వ ఏట జెరోమ్ గారు సిరియా దేశంలోని అంతియోకు పీఠాధిపతులైన పునీత ఫౌలీసన్ వారి హస్తాల మీదుగా పరిశుద్ధ గురుపట్టాభిషేకం పొందారు.రెండు సంవత్సరాల తర్వాత శ్రీ సభకు 37వ పాపు గారైన దమాసన్ గారు జెరోమ్ గార్ని రోమ్ నగరంలో జరగబోతున్న కౌన్సిల్ సమావేశాలకు కార్యదర్శిగా వ్యవహరించాలని ఆదేశించారు.
జెరోమ్ గారితో ఉన్న గొప్ప పాండిత్యం, విశ్వాసం సువార్త గ్రంథాల పట్ల గల పట్టును గుర్తించి పాపుగారు జెరోమ్ గారిని తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు.పాపు గారి ఆదేశాల మేరకు గ్రీకు భాషలో ఉన్న నూతన నిబంధనను లాటిన్ భాష లోకి తిరగరాశారు. ఇది కతోలిక ప్రామాణిక గ్రంథంగా శ్రీ సభ వాడుకుంటుంది.
కీర్తన గ్రంధాన్ని కూడా లాటిన్ భాషలోకి పున: తర్జుమా చేశారు రోమ్ లో ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించారు. రోమ్ నగరంలో ఉన్న కొద్దిమంది భక్తి గల మహిళలను గ్రంధాన్ని చదవాలని ప్రోత్సహించారు.క్రీ.శ 384లో పాపు గారు దమాసన్ గారు మరణించారు. రోమ్ లో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో బెత్లహేము కు వెళ్లారు వీరితోపాటు రోమ్ నగరంలో ఉండే పురుషు, మహిళ భక్తులు కూడా జెరోమ్ గారితో పాటు వెళ్లారు.అక్కడ బెసలికా దేవాలయం దగ్గర ఒక పురుష సన్యాసుల మఠ భవనాన్ని నిర్మించారు. మూడు సభలకు చెందిన మహిళల కోసం ఆశ్రమాలు కట్టించారు.
జెరోమ్ గారు మాత్రం ప్రభువు పుట్టిన స్థలానికి దగ్గరలోనే కొండల్లో కి వెళ్లి ఒక గుహలో తన ఏకాంత ప్రార్ధన ప్రార్ధన జీవితం గడుపుతూ జీవించేవారు.బెత్లెహేములో ఒక ఉచిత పాఠశాలను కట్టించి నిర్వహించారు. యాత్రికుల కొరకు ఒక విశాలమైన సత్త్రాన్ని స్థాపించారు.
బెత్లహేములోనే వీరు 30 సంవత్సరాలు నివసించి చిరస్మరణీయమైన రచనలను పూర్తి చేశారు.బైబిలలో పేర్కొన్న పవిత్ర స్థలాలను స్వయంగా దర్శించిన అనుభవం సుదీర్ఘ ప్రయాణం కఠోర విశ్వాస మఠ జీవితం వీరు గ్రంధాలు రాయడానికి తోడ్పడ్డాయి.జెరోమ్ గారు18 సం" ల నిర్విరామ కృషి చేసి క్రీ.శ 404 లో పూర్తి బైబిల్ ని సిద్ధం చేశారు.
పవిత్ర గ్రంథం గురించి తెలియకపోవడం అంటే క్రీస్తు గురించి తెలియకపోవడమే అని జెరోమ్ గారు చెప్పడం జరిగింది.8సం.ల సుదీర్ఘ జబ్బుతో పోరాడి ఫాదర్ జెరోమ్ గారు క్రీ. శ 420 సెప్టెంబర్ 30న ప్రభువును చేరుకున్నారు. వీరి దేహాన్ని బెత్లహేములోని బసలిక దేవాలయంలో పెట్టారు ఆ తర్వాత 13వ శతాబ్దంలో వీరి భౌతిక కాయాన్ని రోమ్ నగరం తీసుకొని పోయి పునీత మరియ మేజర్ ఒసలిక దేవాలయంలో భద్రపరచబడింది. గ్రంథాలయ నిర్వహకులు పునీత జెరోమ్ గారిని తమ పాలక పునీతులుగా కొనియాడతారు.
జెరోమ్ గారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశాలు
*ప్రేమను పంచటం
*సత్యానికి కట్టుబడి ఉండటం
*మంచి గురువుగా వాక్యాన్ని బోధించడం
*తప్పుల కొరకు ప్రభువు ముందు పశ్చాతాపడటం
*కన్నీటి ప్రార్థన చేయటం
ఉపవాస ప్రార్థన చేయటం
*ప్రాపంచిక వ్యామోహాలను జయించడానికి ప్రభువు ద్వారా శక్తిని పొందుకోవటం
*విశ్వాసులను విశ్వాసంలో ఇంకా బలోపేతం చేయటం.
*కన్నీటి ఉపవాస ప్రార్థన ద్వారా పవిత్రాత్మ వరాలను పొందుకోవటం.
*క్రీస్తుప్రభువు లాగా ఏకాంతంగా ప్రార్థించటం
పునీతులలో ఉండే లక్షణాలు-:
*ప్రార్థన వీరులుగా ఉంటారు
*పవిత్ర జీవితం గడపటం
*ఇహలోక సంపదలని త్యజించడం
*రోగులకు పేదలకు సేవ చేయడం
*దేవునికి పెద్దలకు విధేయించడం
*మంచి పనులు చేసిన అవమానించబడటం
*లోకం చే నిరాకరించబడటం
జెరోమ్ గారిలో ఉన్న గొప్ప విషయాలు-:
*గొప్ప గురువు
*శ్రీసభ పండితులు
*బైబిల్ శాస్త్ర పితామహుడు
గ్రంథాలయ నిర్వహకుల పాలక పునీతులు
*40" సం ల ఏకాంతవాసంలో మునిగి ప్రార్థన పఠనము చేసి క్రీస్తును ధ్యానించిన పునీతులు
ప్రాపంచిక సుఖ భోగాలను వదిలిపెట్టి ఉపవాసం కన్నీటి ప్రార్థన ద్వారా పవిత్రాత్మను పొందిన పునీతులు
*గ్రీకు మూల భాషల్లో ఉన్న బైబిల్ ను లాటిన్ భాషలోకి తర్జుమా చేసిన వ్యక్తి
*బైబిల్ చదవడం ద్వారా క్రీస్తును తెలుసుకోవచ్చని చెప్పిన పునీతులు
*పాఠశాలలను సత్రాలను స్థాపించిన వ్యక్తి
*యదార్ధాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన గొప్ప విశ్వాసి
*ఎన్నో పవిత్ర గ్రంథాలను రాసిన వ్యక్తి
వీరు చూపిన భాషలో నడిస్తే అందరం ఒకరోజు మంచి క్రైస్తవులుగా ప్రభువు ముందు మనం నిలబడగలుగుతాం.