గూగుల్ కన్నా గురువు మిన్న(ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా)
ఫాదర్ చల్ల డేవిడ్(ఎడిటర్, భారతమిత్రం)
04 Sep 2024
"గురువు లేని విద్య గుడ్డి విద్య" అన్న సామెత మనందరికి బాగా తెలుసు. ఈ సమాజం బాగుపడాలంటే గురువులు లేక ఉపాధ్యాయులు పాత్ర ఎంతో అవసరం.ఒక దేశం ఆర్థికంగా ఎదగాలన్నా, ఆధ్యాత్మికంగా వికసించాలన్నా, క్రీడల్లో రాణించాలన్నా గురువు అవసరం ఎంతైనా ఉంది.పలకా బలపం పట్టింది మొదలు విశ్వ విద్యాలయాల్లో చదివి పట్టభద్రులై మేధావిగా సమాజంలో అడుగుపెట్టే వరకు గురువు పోషించే పాత్ర ఎంతో కీలకం.అది సామజిక రంగమైనా, విద్యారంగమైనా,సాంకేతిక రంగమైనా, వైద్యరంగమైనా గురువులేని విద్య నిష్ఫలం. వివిధ మతాచారాలకు అనుగుణంగా వేదాంతం, దైవశాస్త్రం ఏది చదవాలన్న గురు స్థానం గురువుదే. విద్య, శ్రామిక, పారిశ్రామిక ఏ రంగమైన విద్యార్థిని నైపుణ్యాలతో తీర్చిదిద్దేది గురువు మాత్రమే. అంతటి విశిష్ట స్థానమున్న గురువుకి ఈ గురుపూజోత్సవ దినోత్సవం సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిద్దాం.
బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభుని విశ్వ గురువుగా పూజిస్తుంటాం. మనం అనుభవించే అష్టైశ్వర్యాలు కన్నా ప్రేమ, శాంతి సమాధానాల ద్వారానే నిత్యం మనం జీవించగలుగుతున్నాం. భౌతిక జీవనానికి మానవ గురువులు అవసరమైతే ఆ గురువులతో సహా మానవులందరికీ అవసరమైన జీవనానికి ఆధ్యాత్మిక గురువు అవసరం ఎంతైనా ఉంది. అందుకే వివిధ మతాచారాలను బట్టి వారి మతగురువులు ఆధ్యాత్మిక చింతన, పరోపకారం, సోదరప్రేమ ఇత్యాది విషయాలను బోధిస్తుంటారు. సంఘంలో సౌభ్రాతృత్వాన్ని, పరమత సహనాన్ని సాధించాలంటే శాస్త్రీయ విద్య ఉంటే చాలదు. దైవశాస్త్రాన్ని కూడా అభ్యసించాలి. గురుస్థానంలో ఉండి సమాజాన్ని శాంతి సమాధానాల వైపు నడిపించాలి. మతపరమైన ద్వేషాలు, అల్లర్లు చెలరేగకుండా ఆధ్యాత్మిక బోధనలతో సమాజాన్ని నిత్యం చేతన పరచాలి.
నేటి విద్యా విధానం విప్లవాత్మకమైన మార్పులతో పరుగులు పెడుతోంది. పరుగెత్తడాన్నే చూస్తున్నాంగానీ పరుగెత్తలేక పడిపోయి కనుమరుగవుతున్న అల్పులను, అభాగ్యులను పట్టించుకోవడం లేదు. కారణం ఆర్థిక స్థితిగతులు, సామాజిక అంతస్తు, జీవన అసమానతలు. దీనివల్ల ఆణిముత్యాల్లాంటి విద్యార్థులు అధోగతి పాలవుతున్నారు. జీవితంపై కొందరు విరక్తిని పెంచుకుంటే, మరికొందరు సంఘ విద్రోహశక్తులుగా తయారవుతున్నారు. ఈ తప్పు ఎవరిదంటే భుజాలు తడుముకుంటారే తప్ప నిజాలు తెలిసినా, నోరు విప్పి ఎవరు మాట్లాడారు. చచ్చిచెడి చదువుల్ని నెట్టుకొచ్చి ఉద్యోగవేటలో చతికిల పడుతుంటే, సాధ్యంకాని హామీలిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకునే రాజకీయ పరాన్నజీవులు సీట్ల పందారంలో ఓట్లాటలాడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. డబ్బుతో మెట్లు కడుతూ అందలాలు ఎక్కుతున్నారు. అన్ని అర్హతలున్నా, పేదవాన్ని అణగదొక్కుతున్నారు. కర్ణుని చావుకు కారణాలు ఎన్నో అన్నట్లు నేటి విద్యారంగంలో చోటుచేసుకుంటున్న కుహనా మార్పులు ప్రధాన కారణం. డబ్బుంటే చాలు అంగడి సరుకుగా మారిన విద్యార్హతలు చేతికందుతాయి. బంధువులు అయినవారు అధికారంలో ఉంటే చాలు ఐఏఎస్ పరీక్షా పేపర్లయినా ఇంటి గుమ్మం ముందు దర్శనమిస్తాయి. పెత్తందారీ కులాలు ఈనాటికీ బడుగు బలహీనవర్గాల అవకాశాలను కాలరాచి బలవంతంగా లాగేసుకుంటున్నాయి. నైపుణ్యం లేని నియామకాలు ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రయివేటు పరం చేస్తున్నాయి. మన దేశం ప్రగతి పథంలో పయనించి, అన్ని దేశాల ముందు తలెత్తుకొని సగౌరవంగా నిలబడాలంటే నాణ్యమైన విద్యను బోధించే గురువులు, ఆచార్యులు ఎంతో అవసరం.
మన భారతదేశ మొదటి ఉప రాష్ట్రపతిగా సేవలు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ఆయన పుట్టిన రోజునే మన భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకొంటున్నాం. "ఉపాధ్యాయుడు జాతి నిర్మాత" అని ఈయన అంటారు. మరి కొందరు ప్రముఖుల మాటల్లో: "ఉపాధ్యాయుడు విద్యార్థికి విలువైన పాఠ్య గ్రంథము" - గాంధీజీ, "ఉపాధ్యాయుడు ఇస్తాడు విద్యార్థి స్వీకరిస్తాడు ఇవ్వటానికి అంటూ అతని వద్ద కొంత ఉండాలి. స్వీకరించడానికి శిష్యుడు సిద్ధముగా ఉండాలి" - స్వామి వివేకానంద, "ఒక మంచి ఉపాధ్యాయుడు 1000 మంది పూజారుల కన్నా మిన్న" - రాబర్ట్ గ్రీన్. అవును, ఇవన్నీ వాస్తవాలు. విద్యార్థుల అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి అక్షర జ్ఞానాన్ని అందించు వ్యక్తి గురువు. మన భారతీయ సంస్కృతిలో గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః అని గురువును గౌరవిస్తాం. అంటే గురువుకు మన సంస్కృతిలో ఒక మహోన్నతమైన స్థానం ఉంది. నేటి ఉపాధ్యాయులు రాజకీయాలకు అతీతంగా విద్యాదానమే పరమార్థంగా, ఆధునిక బోధనా లక్ష్యాలను ఆకళింపు చేసుకొని విద్యార్థిని తీర్చిదిద్దాలి. గాలి పటానికి దారం ఎంత అవసరమో మన అజ్ఞానాన్ని తొలగించటానికి గురువు అంతే అవసరం. పాఠశాలలు తెరచుకోలేని పరిస్థితుల్లో కూడా ఆన్లైన్లో విద్యార్థులకు చక్కని విద్యను బోధించిన ఉపాధ్యాయులు అభినందనీయులు. నాలుగు గోడల మధ్య సమాజాన్ని నిర్మించేది గురువే. అక్షర జ్ఞానం, లోకజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, సాంకేతిక జ్ఞానం అందించే గురువులందరికీ మా శతకోటి వందనాలు. మరొకమారు ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు, వివిధ రంగాలలో అనేక విధాలుగా నిరంతరం సేవలు చేస్తూ గురుస్థానంలో ఉన్న వారందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.