పునీత మదర్ థెరీసా గారి పండుగ
జోసెఫ్ అవినాష్
04 Sep 2024
నేను చేసే సేవ అనేది..
ఒక నీటి బిందువు అంతటిది మాత్రమే.
కాని దాని ఆవశ్యకత ఒక సాగరమంత.
ఆ ఒక బిందువును నేను చేర్చకపోతే..
సముద్రంలో ఒక నీటి బిందువు తగ్గిపోతుంది.
- పునీత మదర్ థెరీసా
మదర్ థెరీసా జీవితం తెరిచిన పుస్తకం. ఆ తల్లి జీవితం నుంచి మనము తెలుసుకోవలసినది.. నేర్చుకోవలసినది చాలా ఉంది. కోల్‌కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన ఆ తల్లి గురించి ఎన్నో పుస్తకాలు , రచనలు వచ్చాయి.తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి ఎందరికో అమ్మగా మారింది. భారతీయులతో ‘అమ్మ’అని పిలిపించుకున్న అంతటి మహనీయత గల వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
మదర్ థెరీసా భూలోక జీవితాన్ని పరిశుద్ధతతో జీవించి ధన్య మరణంతో పరలోక ప్రాప్తి పొందారని తల్లి శ్రీసభ విశ్వసిస్తూ ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఆమె వర్ధంతిని ఒక గొప్ప మహోత్సవంగా కొనియాడుతూ ఉంది. ఈ శుభ సందర్భంగా ఆమె జీవిత విశేషాల్లో కొన్ని విషయాలను తెలుసుకుందాం
పునీత మదర్ థెరీసా గారు 1910వ సంవత్సరం ఆగస్టు 26వ తేదీన ఉత్తర మాసిడోనియా రాష్ట్రంలోని స్కొప్జీ నగరంలో ఆదర్శవంతమైన కతోలిక కుటుంబంలో జన్మించారు.. ఆగ్నెస్ గోన్‌జా బొయాహు పేరుతో జ్ఞానస్నానం స్వీకరించారు..ఆల్బేనియన్ భాషలో గొన్‌జా అంటే గులాబీ మొగ్గ అని అర్థం. భక్తిపరులైన తల్లిదండ్రులు పెంపకంలో పెరిగారు. మదర్ తల్లిదండ్రులు స్థితిమంతులు కానప్పటికీ తమకు కలిగిన దానిలో పేదలకు సహాయం చేసేవారు. అభాగ్యులను అనాధలను ఆదరించేవారు. "ఇతరుల కడుపు నింపకుండా మనం ఏది తినకూడదమ్మా" అని చిన్నతనం నుండే తల్లిదండ్రులు ఆమెకు నూరిపోశారు.. మదర్ థెరీసా బాల్యంలోనే తండ్రి మరణించారు.. తండ్రి ఆశయాలతో జీవించడం నేర్పించిన తల్లి సేవ జీవితం మదర్ థెరీసాను ఎంతగానో ఆకర్షించింది.. తల్లి అడుగుజాడల్లో నడుస్తూ కతోలిక జీవన విధానంలో దైవ మానవ సేవలో లీనమైంది .కతోలిక ఆచారాలు, జగద్గురువుల రచనలు , సందేశాలు ,హిత బోధలు ఈ కన్యకను ఎంతో ప్రేరేపించి మఠకన్య మార్పుకు ఆకర్షించాయి..18 సంవత్సరాల వయసులో ఆమె లొరీటో ఐరిష్ అను మఠకన్యల సభలో చేరి, ఆంగ్ల భాషలో ప్రావీణ్యతను పొంది, 1931 మే నెల 24వ తేదీన ‘మఠకన్యగా' ప్రమాణ స్వీకారం చేశారు..వెంటనే భారతదేశంలోని కలకత్తా నగరానికి చేరుకుని, 1931 నుంచి 1948 వరకు కలకత్తాలోని సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.
మహా సంకల్పబలం-:
ఓ రోజు రాత్రి కలకత్తాలో వీథిలో వెడుతుండగా ఓ అనాథ స్త్రీ విపరీతమైన అనారోగ్యంతో వచ్చి మదర్ చేతుల్లో పడింది. ‘ప్రాణం పోతోంది, చాలా బాధగా ఉంది. నన్ను డాక్టర్‌కు చూపించు’ అంది. ఎవరని అడిగితే ఎవరూ లేరు, అనాథనంది. ఆ క్షణంలో ఆమెకు గివింగ్ ఈజ్ లివింగ్(ఇచ్చుకోవడమే జీవిత పరమార్థం) అనిపించింది. ఆమెను కనీసం 10 వైద్యశాలలకు తీసుకెళ్ళింది. ‘తగ్గించడానికి చాలా ఖర్చవుతుంది, చికిత్స కుదరదు’ అన్నారు అంతటా. ఈ తిప్పటలో ఆ అనాథ ప్రాణాలు విడిచేసింది.‘ఇలా చచ్చిపోవడానికి వీల్లేదు’ అని థెరీసాకు అనిపించింది. ‘పక్కవాడు చచ్చిపోయినా ఫరవాలేదు–అని బతకడానికి కాదు మనుష్యజన్మ’ అని...‘‘ఇక నా జీవితం పదిమంది సంతోషం కోసమే’ అని సంకల్పించి నేరుగా తన గదికి బయల్దేరింది. ఒక పాత బకెట్, రెండు తెల్లచీరలు,5 రూపాయలు పట్టుకుని ఆమె బయటికి నడుస్తుంటే... ఎక్కడికని తోటి స్నేహితులడిగారు. ‘ఇకపైన కష్టాలున్న వాళ్లెవరున్నారో వాళ్ళందరికీ తల్లినవుతాను’’ అని చెప్పి బయల్దేరబోతుంటే... ‘వీటితో...అది సాధ్యమా’ అని అడిగారు. ‘‘నేను తల్లి పాత్ర పోషించబోయేది, గుండెలు నిండిన ప్రేమతో, ఆదుకోవాలన్న తాపత్రయంతో’’ అని చెప్పి గడప దాటింది. అదీ సంకల్పబలం అంటే.
భారత్‌లో సేవలు-:
యాగ్నిస్ తన తొలి నామాన్ని థెరీసాగా మార్చుకుని, అందమైన హిమాలయాలలోని డార్జిలింగ్ నగరంలో రోమన్ క్యాథలిక్‌గా సేవలు ప్రారంభించారు. అనంతరం ఆమె కలకత్తా శివార్లలోని ‘ఎంటాలీ’ అనే చోట లొరీటో కాన్వెంట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ, అదే స్కూల్లో 1944వ సంవత్సరంలో ప్రధానోపాధ్యాయిని అయ్యారు. ఆ ఏడాది బెంగాల్ రాష్ట్రంలో కరువు వచ్చి, కలకత్తా నగరంలో ఆకలి వల్ల రోగాల వల్ల ఎందరో చనిపోయారు. దానికి తోడు, 1946లో హిందు, ముస్లిం మత వైషమ్యాలు, విధ్వంసకర సంఘటనలు కలకత్తా నగరాన్ని అల్లకల్లోలం చేసి, భయంకరంగా తయారుచేశాయి. మదర్ థెరీసా 1946 సెప్టెంబర్‌లో అంతఃకరణ ప్రబోధంతో సంఘసేవకు శ్రీకారం చుట్టారు. ఆమె కలకత్తా నగరంలోని పేదలు నివసించే పేటలలో తన సహాయ కార్యక్రమాలు ప్రారంభించి, మోతీజిల్ అనే మురికివాడలోని పిల్లలకు ఒక స్కూల్ ప్రారంభించి, అక్కడి పేదలకు సేవ చేయటం ప్రారంభించారు. రోగులకు సేవ చేయటం కోసం ఆమె బీహార్‌లోని పాట్నా నగరంలోని ఒక హాస్పిటల్‌లో కొద్ది నెలల మెడికల్ ట్రైనింగ్ పొందారు. బెంగాల్ కరువు రోజుల్లో ఆమె సేవను గుర్తించి, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎంతగానో ప్రశంసించారు.
మదర్ థెరీసా రోమన్ క్యాథలిక్ వ్యవస్థకు కేంద్రమైన ‘వాటికన్’ నుంచి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ స్థాపనకు జగద్గురువుల అనుమతి పొందారు. సాధారణంగా మిషనరీలో సేవ చేసే మఠకన్యలు ధరించే దుస్తులకు బదులు నీలి అంచు తెల్ల చీరను తమ సంస్థకు గుర్తింపుగా నిర్ణయించారు. ఈ విధంగా థెరిసా మన రోమన్ కధోలిక వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ, స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ అనే సేవాసంస్థను నిర్వహించారు..
మిషనరీస్ ఆఫ్ చారిటీ కార్యక్రమాలు-:
వృద్ధాప్యంలో ఉన్న, మరణానికి చేరువలో ఉన్న అభాగ్యుల కోసం ఆశ్రమం నడపడం. ఈ ఆశ్రమంలో మరణించినవారికి వారి మత కట్టుబాట్లకు అనుగుణంగా ఉత్తర క్రియలు జరపటం(ఆశ్రమంలో మహమ్మదీయులు మరణిస్తే ఖురాన్ పఠనం, హిందువులు మరణిస్తే వారికి గంగాజలంతో అంత్యక్రియలు, క్రైస్తవులకు శ్రీసభ నిబంధనలకనుగుణంగా నిర్వహించటం) వంటి జనామోదకర విధానాల అమలు.
కుష్ఠు రోగులకు ఆశ్రమం నిర్మించి, నగరంలో వివిధ ప్రాంతాలలో వారికి వైద్య సౌకర్యాలు కల్పించటం.
1955లో నిర్మలా శిశుభవనం స్థాపించటం.
‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’లో బ్రదర్స్ విభాగం, మఠకన్యల విభాగం, గురువుల విభాగం ఏర్పాటు చేసి నిష్ణాతులైన సేవకులను తయారుచేయటం.
దేశదేశాల్లో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థలను ప్రారంభించటం.
మదర్ థెరిసా అకుంఠిత దీక్ష, కృషి, పరిశ్రమల ఫలితంగా 1996వ సంవత్సరం నాటికి 100కి పైగా దేశాలలో 517 మిషనరీస్ ఆఫ్ చారిటీ శాఖలు ప్రారంభమయ్యాయి. ఇవి ప్రపంచమంతటా మానవ సేవను కొనసాగిస్తూ ఉన్నాయి.
ఇతర దేశాలకు సైతం తన సేవను అందించారు-:
మదర్ థెరీసా సేవలు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, రోమ్, టాంజానియా, ఆస్ట్రియాలకు సైతం తన సేవలను విస్తరించారు.
• కేవలం నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు, అంటువ్యాధులు సోకినవారికి, బాధితులు, శరణార్థులు, అంధ, వికలాంగ, వృద్ధులకు, మద్యపాన వ్యసనానికి బానిస అయినవారికి సైతం థెరీసా సేవలందించారు.
• 1982లో ఇజ్రాయిల్ - పాలస్తీనా గెరిల్లాల పోరు మధ్య చిక్కుక్కున్న 37 మంది పిల్లలను థెరీసా కాపాడారు. రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి ఆమె అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించారు.
వెలుగు దీపం-:
‘ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసేముందు- తినడానికి ఏమీ లేని పేదల గురించి ఆలోచించు’. తనకు అసౌకర్యంగా, బాధగా అనిపించినప్పుడు తన గురించి కాకుండా కోట్లాది మంది దీనుల గురించి ఆలోచించారు మదర్ థెరిసా. ఆ ఆలోచనే కలకత్తాలో ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’గా రూపుదిద్దుకుంది. వేల కిలోమీటర్ల దూరమైనా...ఒక్క అడుగుతో మొదలైనట్లు 13 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తమైంది.
ఆకలితో అలమటించేవాళ్లు, వ్యాధిగ్రస్తులు, పేదవాళ్లు, నిరాశ్రయులకు ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ వెలుగు దీపం అయింది. కలకు, ఆ కలను నిజం చేసుకునే వాస్తవానికి మధ్య దూరం ఉండొచ్చు. అది కొందరికి అగాధంలా కనబడవచ్చు. సంకల్పబలం ఉన్నవాళ్లకు అది సులభం కావచ్చు. ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ రాత్రికి రాత్రే పుట్టింది కాదు. ఆలోచన నుంచి ఆచరణ నుంచి, కష్టాల దారిలో నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నిర్మాణాత్మక సేవా దృక్పథం..
నిస్వార్థ సేవలకు గుర్తింపుగా నోబెల్ పురస్కారం-:
పునీత మదర్ థెరీసా సేవలను గుర్తించి, 1979వ సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. దారిద్య్రంలో బాధపడేవారికి, రోగులకు, అనాథలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులకు అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆమెకు నోబెల్ పురస్కారం ఇవ్వటం జరిగింది. ‘ఆమె ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ పురస్కారం అందుకుంటుంద’నే ప్రశ్నకు ‘‘నా రక్తం ఆల్బేనియాది. నా పౌరసత్వం భారత్‌ది. నా విశ్వాసం కధోలిక మతానిది. నా వ్యక్తిత్వం ప్రపంచానిది. నా హృదయం క్రీస్తుకు చెందినది’’ అని ఉన్నతమైన సమాధానమిచ్చారు థెరిసా. ‘నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ప్రపంచశాంతిని నెలకొల్పేందుకు మీరిచ్చే సందేశం ఏమిట’ని ప్రశ్నించినప్పుడు ‘‘ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలను ప్రేమిస్తే చాలు, ప్రపంచశాంతి దానంతటదే నెలకొంటుంది’’ అన్నారు పునీత మదర్ థెరిసా....
పునీత పట్టం-:
ప్రార్ధించే పెదవులతో పాటు సాయం చేసే చేతుల అవసరతను విశ్వవ్యాప్తంగా తెలియజెప్పి భారతదేశ సంస్కృతిలో భాగమైన మదర్ థెరీసాను రెండవ జాన్ పాల్ జగద్గురువులు రోమాపురిలో అక్టోబర్ 19 2003న "ధన్యులుగా" ఫ్రాన్సిస్ జగద్గురువులు సెప్టెంబర్ 4 2016న పునీతులుగా ప్రకటించారు...
ఆచరణ-:
ఎక్కడ ఎలా పుట్టాం.. ఎలా పెరిగాం అన్నది కాదు.... మన ముగింపు ఎంత గొప్పగా ఉందనేది ముఖ్యం. పదిమందికి సాయం చేయాలనే ఆలోచనతో ఉండే వ్యక్తులు జీవితంలో ఎప్పటికైనా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అభాగ్యులకు సేవ చేయడాన్నే పరమావధిగా భావించి, జీవితం మొత్తం సేవకే అంకితం చేసిన మహోజ్వల మూర్తి మదర్ థెరిసా.. ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టిన మదర్ థెరిసా, భారత్‌కు వచ్చి కోల్‌కతా మురికివాడలో అనాధ శరణాలయాన్ని స్థాపించి, లక్షలాది మందిని చేరదీసి అమ్మగా మారారు. ఆమె సేవ జీవితం మనందరికీ ఆదర్శం..ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అనే మదర్ థెరెసా మాటలను మనమందరం మననం చేసుకుంటూ మదర్ థెరెసా చూపిన మానవత్వాన్ని, దయార్ద హృదయాన్ని, సేవలను ఆచరించడమే ఆమెకు మనమివ్వగలిగే ఘనమైన నివాళి......