ఘనముగా ముగిసిన దివ్యవాణి టీవీ 8వ వార్షికోత్సవ వేడుకలు
జోసెఫ్ అవినాష్
04 Sep 2024
తెలుగు కతోలిక విశ్వాసుల చిరకాల స్వప్నం, దివ్యవాణి టీవీ, తెలుగు కతోలిక పీఠాధిపతుల మండలి పోషణలో, ఇంటింటా సువార్త సుగందాన్ని వెదజల్లుతున్నది. పవిత్రాత్మ సర్వేశ్వరుని ఏలుబడిలో , దిగ్విజయంగా 8 వసంతాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 2, 2024న హైదరాబాద్, పునీత యోహాను ప్రాంతీయ గురువిద్యాలయ ఆడిటోరియంలో దివ్యవాణి టీవీ 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు, తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షులు, కార్డినల్ మహా. ఘన.శ్రీ.శ్రీ.శ్రీ పూల అంతోని గారు దివ్యపూజబలిని సమర్పించగా, నల్గొండ పీఠాధిపతులు మహా. ఘన. శ్రీ.శ్రీ.శ్రీ కరణం ధమన్ కుమార్ గారు చక్కగా దివ్యవాణి టీవీలో వస్తున్న ప్రసారాలు క్రైస్తవులకే కాకుండా ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, రానున్న కాలంలో ఇంకా మరెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ప్రసారం చేయాలని అందుకు పీఠాధిపతులుగా మా సహకారం, ప్రార్ధన ఎల్లవేళలా ఉంటాయని తెలియజేశారు.కర్నూలు పీఠ కాపరి. మహా. ఘన. శ్రీ .శ్రీ .శ్రీ గోరంట్ల జ్వనేషు,విశ్రాంత విశాఖ అగ్ర పీఠాధిపతులు మహా ఘన శ్రీ.శ్రీ. శ్రీ మల్లవరపు ప్రకాష్ దివ్యవాణి టీవీ అభివృద్ధికై ప్రార్థించి, వారి అమూల్యమైన సలహాలను, సందేశాలను పూజ అనంతరం తెలియజేశారు.దివ్యవాణి నృత్య రూపకం చక్కగా ప్రదర్శించారు, ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తదుపరి దివ్యవాణి టీవీ సీఈఓ గురు. శ్రీ డా. లూర్దు రాజ్ sj. 8 వసంతాల దివ్యవాణి ప్రయాణం, ముఖ్యంగా తమ బాధ్యతలను స్వీకరించిన తదుపరి పునరుద్ధరించిన కార్యక్రమాలను, విధి విధానాలను, కొత్త కార్యక్రమాల రూపకల్పనను, వ్యయ ప్రయాసాలను, కొంగొత్త ఆలోచనలను తన నివేదికలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు.
వందన సమర్పణను, ఏలూరు పీఠాధిపతులు, దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహా ఘన శ్రీ.శ్రీ.శ్రీ పొలిమెర జయరావు గారు సమర్పించి,వచ్చిన పీఠాధిపతులను ఘనంగా సన్మానించి ,విచ్చేసిన గురువులకు, కన్యా స్త్రీలకు, గృహస్థవిశ్వాసులకు, దివ్యవాణి ప్రేక్షకులకు, వివిధ రకాల దాతలకు, దివ్యవాణి సిబ్బందికి కృతజ్ఞతలను తెలియజేశారు. చివరిగా దివ్యవాణి టీవీ ప్రోగ్రాం డైరెక్టర్ గురు.శ్రీ ప్రశాంత్ అనకర్ల అందరికీ వందన సమర్పణ చేయగా,పసందైన విందు భోజనముతో దివ్యవాణి టీవీ 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.