భక్తి కీర్తన : పద్యపదాలు
డా. కొక్కెరగడ్డ పూర్ణానందం
03 Sep 2024
తే.గీ.
ప్రభువె తమ దేవుడను జాతి
ప్రభల నొందు
తనదు ప్రజలని దేవుడే
యెన్ను కొనిన
భాగ్యవంతులు యా ప్రజ
బాగుమీర
ధన్యు లాజను లెల్లరు
ధరణి పైన
తే.గీ.
ఆకసము నుండి క్రిందికి
పారజూచి
నరుల పరిశీలనము జేయు
నంబరమున
తాను సింహాసనము నున్న
తావునుండి
భూనివాసుల పరికించు
జ్ఞాని ప్రభువు
తే.గీ.
విశ్వ సింతుము ప్రభుని, యా
విభుడె గాచు
తానె డాలుగ సాయమౌ
తక్షణమున
పరవశంబుగ మేమంత
ప్రభుని తలచి
నమ్మి యుందుము పరిశుద్ధ
నామ మందు
తే.గీ.
నరుల హృదయాలు నిర్మించె
నేకరీతి
జనుల క్రియలన్ని దర్శించు
ఘనుడు ప్రభువు
తనకు భయపడి, నమ్మగా
తనదు కరుణ
ఆదరించును స్థిరముగా
నాదు కొనును